మాతృత్వాన్ని మరిచి మద్యం మత్తులో తూలుతూ నడిరోడ్డుపై పడిపోయిన ఓ తల్లి. ఆకలి బాధతో గుక్కపెట్టి పసిబిడ్డ ఆర్తనాదాలు. ఎముకలు కొరికే చలిలో వణుకుతూ మరోబిడ్డ ఎదురుచూపులు. దయనీయ పరిస్థితుల్లో దేవుళ్లలా వచ్చి అభాగ్యులను చేరదీసిన పోలీసులు. అర్ధరాత్రి వేళ కళ్లు చెమర్చే ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది.
గోపాలపురం ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేస్టేషన్ ప్రాంతంలో దుర్గ అనే ఓ మహిళ నాలుగేళ్ల కుమారుడు, నెల రోజుల పాపతో బిక్షాటన చేస్తూ పూట గడుపుతోంది. సాయంత్రం పూటుగా మద్యం సేవించిన దుర్గ అర్ధరాత్రి వేళ స్టేషన్ అవుట్‌గేట్ ప్రాంతంలో మత్తుతో పడిపోయింది. చల్లటి చలిలో బాబు ఓ చోట కూర్చుని రోదిస్తుండగా ముక్కుపచ్చలారని పసిగుడ్డు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తోంది.
అటుగా గస్తీ నిర్వహిస్తున్న గోపాలపురం పోలీసులు ఒంటిగంట ప్రాంతంలో చిన్నారుల దయనీయ పరిస్థితిని గమనించి అక్కడికి వెళ్లారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను తట్టిలేపేందుకు ప్రయత్నించినా ఫలితంలేకపోవటంతో108ను పిలిపించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాబు, పాపను ఠాణాకు తీసుకెళ్లిన పోలీసు సిబ్బంది ఉదయం వరకు వారి ఆలనాపాలనా చూసుకుని ఉదయం ఛైల్డ్‌లైన్ సిబ్బందిని పిలిచి వారికి అప్పగించారు.
ఇవీ చదవండి: