ఎందుకు ఎప్పుడూ డల్‌గా ఉంటున్నావట. మీ అమ్మానాన్న చాలా కంగారు పడుతున్నారంటూ 12 ఏళ్ల బాలికను గుచ్చిగుచ్చి ప్రశ్నించినపుడు వచ్చిన సమాధానం విన్న ఆ మనస్తత్వ నిపుణురాలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. సోదరుడు వరుసయ్యే యువకుడు తన పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతూ ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్వటం చూసిన తనకూ కన్నీరు ఆగలేదంటూ మనస్తత్వ నిపుణురాలు తన అనుభవాన్ని పంచుకున్నారు.
నగర శివారు కాలనీలో ఓ స్వచ్ఛంద సంస్థ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసింది. అనంతరం బాలబాలికలకు సైబర్‌నేరాలు, లైంగిక వేధింపులు, మంచి/చెడు స్పర్శ(గుడ్, బ్యాడ్ టచ్) గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం 8వ తరగతి చదివే విద్యార్థిని తాను ప్రత్యేకంగా మాట్లాడేందుకు వచ్చానంటూ మహిళా కౌన్సెలింగ్ సైకాలజిస్టును కోరింది. తల్లితో చనువుగా ఉండే వ్యక్తి కొద్దిరోజులుగా తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు బాలిక వెల్లడించింది. విషయం బయటకు చెబితే చంపుతానంటూ భయపెట్టినట్లు ఆవేదన వెలిబుచ్చింది. దీంతో ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లటంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఫోన్లలోను వదలట్లేదు
చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి 2016లో పోక్సో కేసులు 105 నమోదైతే 2019 నాటికి ఆ సంఖ్య 345కు చేరింది. 2021 ఆగస్టు చివరి నాటికి సుమారు 200కు పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్ కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు తప్పనిసరిగా మారాయి. అక్కడా కొందరు గురువులు పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గతేడాది సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఉపాధ్యాయులు 9వ తరగతి విద్యార్థిని వాట్సాప్ నెంబర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ తీవ్ర మనోవేదనకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుల వికృత చేష్టలపై సుమారు 150-200 వరకూ షీటీమ్స్‌కు ఫిర్యాదులు అందాయి.
ఇంకిన కన్నీళ్లు ఇంకెన్నో
గ్రేటర్ పరిధిలో చిన్నారులపై లైంగిక వేధింపులు ఏటేటా పెరుగుతున్నాయి. నిందితుల్లో బాధితులకు తెలిసిన వ్యక్తులే 70-80శాతం వరకూ ఉంటున్నారు. నిత్యం ఏదోరూపంలో వేధింపులు చవిచూస్తూ బయటకు చెప్పేందుకు వెనుకాడుతున్న బాలికలు ఉన్నారు. పేదవర్గాలు నివసించే ప్రాంతాల్లో ఈ తరహా దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లైంగిక వేధింపులు, వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు/తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు నగరంలో మహిళా శక్తికేంద్రాల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, కౌన్సెలింగ్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో సున్నితమైన అంశాలను వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సంక్షేమం కోసం పనిచేసే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా మురికివాడల్లో క్యాంపులు నిర్వహిస్తూ గృహహింస, లైంగిక వేధింపులపై అవగాహన కల్పిస్తున్నాయి.
చిన్నారుల భావోద్వేగం
పేద కుటుంబాల్లోని బాలికలు, మహిళలకు ఉచితంగా రుతురుమాళ్లు(నాప్‌కిన్స్) పంపిణీ చేసే సంస్థ బాల్యవివాహాలు, రక్తహీనత, రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తుంటారు. ఆ సమయంలో కొందరు బాలికలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఉద్వేగానికి గురవుతుంటారని ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా ప్రతినిధి తెలిపారు. వలస కుటుంబాల్లోని పిల్లలు ఎక్కువగా వేధింపుల బారినపడుతున్నట్లు తాము గుర్తించామన్నారు. బాలకార్మికులుగా మారుతున్న వారిలో బాలికలూ ఉంటున్నారు. వీరిలో 30-40శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో గుర్తించారు. గతేడాది పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ అనాథాశ్రమంలో లైంగికదాడికి గురైన బాలిక ఆరోగ్యం క్షీణించి మరణించింది.
ఇదీ చదవండి: Minister Mallareddy: 'ఆ కామాంధున్ని విడిచిపెట్టేది లేదు.. ఎన్కౌంటర్ చేయాలి.. చేస్తం'