Intermediate Results in TS: రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షల మంది పరీక్ష తప్పగా, వారిలో దాదాపు 1.75 లక్షల మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులేనని సమాచారం. తెలంగాణలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 20 చోట్ల 5-10 శాతం ఉత్తీర్ణతే దక్కింది. ఉదాహరణకు జోగిపేట కళాశాలలో 5.49 శాతం, అక్కడి బాలికల కళాశాలలో 6 శాతం, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోనూ 6 శాతం మందే పాసయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెండు కళాశాలలో 10.50 శాతమే దక్కింది. ఈ పరిణామాలతో కంగుతిన్న ఇంటర్‌బోర్డు సర్కారు కళాశాలల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత ఎంతనేది వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది. విద్యార్థులకు టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? అధ్యాపకుల పర్యవేక్షిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని విశ్లేషించకుండా బోర్డు గుడ్డిగా వ్యవహరించిన ఫలితమే తాజా ఫలితాలని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. తక్కువ ఉత్తీర్ణత రావడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. కేజీబీవీలు ఈసారి నయమనిపించాయి. వాటిల్లో 9,076 మంది పరీక్షలు రాయగా, 4,546 మంది(50.09) ఉత్తీర్ణులయ్యారు.
పునః మూల్యాంకనం ఫీజు 50% తగ్గింపు
ఇంటర్ ప్రథమ సంవత్సరం జవాబుపత్రాల పునఃమూల్యాంకనం రుసుమును 50% తగ్గించారు. విద్యాశాఖ మంత్రి సబిత ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పునఃమూల్యాంకనానికి ఒక్కో సబ్జెక్టుకు రూ.600 ఫీజు ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 22 తుది గడువు. ఉత్తీర్ణత 49 శాతమే ఉండటంతోపాటు తప్పిన వారిలో దాదాపు మూడొంతుల మంది సర్కారు విద్యాసంస్థల విద్యార్థులే కావడంతో పునఃమూల్యాకనం ఫీజును తగ్గించినట్లు తెలుస్తోంది. పునః లెక్కింపునకు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 ఫీజు ఉండగా దానిని తగ్గించలేదు.
ఏప్రిల్‌లో మళ్లీ రాసుకోవచ్చు
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఏప్రిల్‌లో వార్షిక పరీక్షల సందర్భంగా మళ్లీ రాసుకోవచ్చని ఇంటర్‌బోర్డు పేర్కొంది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జలీల్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా కారణంగా 30 శాతం సిలబస్ తగ్గించామని, ఛాయిస్ 50 శాతానికి పెంచామని చెబుతూ.. తక్కువ శాతం ఫలితాలకు తమ తప్పేమీ లేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో రాసుకోవచ్చని చెప్పడం ద్వారా ఆలోపు సప్లిమెంటరీ పరీక్షలు ఉండవని చెప్పకనే చెప్పినట్లయింది.
ఇదీ చూడండి: Inter Student Suicide: ఇంటర్లో ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య