మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా మోగ్లీ సునీతా ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షురాలిగా కొనసాగుతున్న నేరెళ్ల శారద స్థానంలో...సునీతను నియమిస్తూ... ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె నియామకపు ఉ్తతర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీకి చెందిన సునీతా ముదిరాజ్... 1987 కళాశాల విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ అనుబంధ సంస్థలైన యువజన కాంగ్రెస్‌లో ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షురాలిగా, ఏపీసీసీ సభ్య కార్యదర్శిగా, ఓబీసీ కన్వీనర్‌గా, టీపీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా మోగ్లీ సునీత పనిచేశారు.
వృత్తి రీత్యా న్యాయవాదైన ఆమె... 25ఏళ్లుగా వివిధ హోదాల్లో పార్టీకి సేవలందిస్తున్నారు. పార్టీ విధేయురాలిగా, మహిళా సమస్యలపై అవగాహన కలిగిన నాయకురాలిగా... కాంగ్రెస్ అధిష్ఠానం సునీతకు ఈ పదవిని కట్టపెట్టింది. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలను అప్పగించిన... పార్టీ అధిష్ఠానానికి సునీత కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యాచరణపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం