Telangana Govt set up Modern Rice Mills : వరి ధాన్యం ఉత్పత్తి, రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యం, కొత్త మిల్లుల ఏర్పాటు అంశాలపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, అంతర్జాతీయ రైస్ మిల్లు తయారీ కంపెనీ సటాకే ఇండియా డైరక్టర్ ఆర్‌కే బజాజ్ తదితర ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ .. తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకొందని సీఎం వివరించారు.
అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు సహా.. మరి కొద్దిరోజుల్లో పూర్తికానున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరగనుందని కేసీఆర్ తెలిపారు. తద్వారా వరి ధాన్యం నాలుగు కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిల్వ ఉన్న కోటీ పది లక్షల టన్నుల వరి ధాన్యం.. నాలుగు లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా భారత ఆహార సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ ఆక్షేపించారు.
Modern Rice Mills in Telangana : ఈ పంట పరిస్థితులు ఇలా ఉంటే అదనంగా మరింత వరి ధాన్యం దిగుబడి కానున్న పరిస్థితుల్లో.. రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలచాలని కేసీఆర్ అన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసి.. అన్నదాతకు మరింత లాభం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పంటకు పెట్టుబడి అందించడం మొదలు ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి కొనే వరకు.. దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ వివరించారు.
Food Processing Units in Telangana : తెలంగాణ పచ్చబడి, విపరీతంగా పంట దిగుబడి పెరిగిందన్న కేసీఆర్.. రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలన్నారు. అప్పుడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతు లాభాలు గడిస్తారని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను స్థాపించాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు.
KCR Review on Modern Rice Mills : ఇందులో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న మిల్లులకు అదనంగా.. మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రస్తుత రైస్ మిల్లులు యధావిధిగా కొనసాగుతూనే.. అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు మాత్రమే ఉందని.. మరో రెండు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా మిల్లులను ఏర్పాటు చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.
Telangana Modern Rice Mills : అదనంగా పండుతున్న ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్టుగా అధునాతన రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఐఏఎస్ కమిటీని సీఎం ఏర్పాటు చేశారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షులుగా ఉండే కమిటీలో.. సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల కమిషనర్ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా కొనసాగుతారు. అధునాతన రైస్ మిల్లులు ఏర్పాటు కోసం అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో ఇప్పటికే చర్చించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారితో శనివారం నుంచే కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి :