సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ... మోడల్ స్కూల్స్ బాలికల హాస్టల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 హాస్టళ్లలో వార్డెన్, ఏఎన్ఎమ్, వాచ్ ఉమెన్, కుక్ వంటి పోస్టుల్లో ఏడేళ్లుగా పని చేస్తున్నట్లు వారు తెలిపారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రూ. 6700 జీతం మాత్రమే ఇస్తున్నారని.. ఇప్పటి వరకు వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్కైనా, వాచ్ ఉమెన్కైనా సమాన జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
కరోనా కారణంగా ఏడాది కాలం నుంచి తమకు జీతాలు ఇవ్వలేదని... దీంతో తమ కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమాన వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సౌకర్యాలను తమకు వర్తింపజేయాలని కోరారు.
ఇదీ చదవండి: శంషాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై చేపల మార్కెట్: తలసాని