హైదరాబాద్ మహానగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో మల్టీ మోడల్ ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టం-ఎంఎంటీఎస్ అందుబాటులోకి వచ్చింది. ఎంఎంటీఎస్ రాకతో ప్రయాణికులు ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కలిగింది. కేవలం 5, 10, 15 రూపాయలతో చిరువ్యాపారులు, ఉద్యోగులు సేవలు వినియోగించుకునేవారు.
వీలయినంత త్వరగా
2003 ఆగస్టులో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు గతేడాది మార్చి 23 వరకు నిరంతరాయంగా సేవలందించాయి. అలాంటిది కరోనా దెబ్బకు ఏడాదిగా షెడ్డుకే పరిమితమయ్యాయి. అరకొర జీతాలు, ఆదాయంతో బతుకుబండి నడిపేవారికి ఎంఎంటీఎస్ నడవకపోవడం పెద్ద దెబ్బేనని ప్రయాణికుల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వీలయినంత త్వరగా తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తోంది.
ప్రయాణం భారం
ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర 2003 నుంచి నిరంతరం సేవలందిస్తున్నాయి. 15 కిలోమీటర్ల సికింద్రాబాద్-ఫలక్‌నుమా సెక్షన్ ఫిబ్రవరి 2014లో ప్రారంభమైంది. జంట నగరాల్లో మొత్తం 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రారంభంలో 48 సర్వీసులు, 6 కోచ్‌లు 13వేలమంది ప్రయాణికులతో ప్రారంభమైన సర్వీసులు ప్రస్తుతం 121 సర్వీసులతో లక్షా 65వేల మంది ప్రయాణికుల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడంతో నగరవాసులకు ప్రయాణం భారంగా మారుతోంది. చిరువ్యాపారులు, చిరుద్యోగుల సగం జీతం రవాణా ఖర్చులకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి: 'ప్రతి కొవిడ్ కేసుకు 25-30 మందిని గుర్తించాలి'