MLC Paadi KaushikReddy apologized to Governor: గవర్నర్ తమిళిసై పట్ల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ఆయన దిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైకి లిఖితపూర్వక క్షమాపణ చెబుతానని కౌశిక్‌రెడ్డి మహిళా కమిషన్‌కు తెలిపారు. క్షమాపణ పత్రం మహిళా కమిషన్‌కు కూడా పంపుతానని ఆయన చెప్పారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి ఈనెల 14న నేషనల్ ఉమెన్ కమిషన్ నోటీసులు పంపిన విషయం విధితమే. ఆ మేరకు ఆయనను వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ ఈ నోటీసులు పంపింది.
గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది. కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకై డీజీపీకి ఆదేశాలివ్వాలని, ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్‌గౌడ్ ఎస్‌హెచ్‌ఆర్సీని కోరారు.
గవర్నర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: పాడి కౌశిక్‌రెడ్డి జనవరి 25న జమ్మికుంటలో నిర్వహించిన ఓ సమావేశంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తన దగ్గరే అంటి పెట్టుకుంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ వరకు వెళ్లింది.
ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: మరోవైపు గవర్నర్ తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్‌ను మహిళ అని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: