గ్రేటర్ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నేతలు పర్యాటకులుగా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం సమంజసం కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ అభ్యర్థులకు మద్దతుగా హైదరాబాద్ కవాడిగూడలోని కేంబ్రిడ్జ్ గ్రామర్ హైస్కూల్లో టీఆర్ఎస్ఎంఏ(ట్రస్మ) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
జీఓ 46 ప్రకారం ఫీజులు పెంచకుండా ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు లోబడే నడుస్తున్నాయని పేర్కొన్నారు. గల్లీ ఎన్నికైనా.. దిల్లీ ఎన్నికనా తెరాస పార్టీకి అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలను పట్టించుకోడంలో తెరాసకు ఉన్న పట్టింపు ఏ పార్టీకి ఉండదని అన్నారు. హైదరాబాద్లో నీటి పన్ను రద్దు చేస్తూ.. దేశంలో దిల్లీ తర్వాత ఒక అద్భుత నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నేడు కులం, మతం, ప్రాంతం కాదు... ప్రజల సంక్షేమం ముఖ్యం... రూ. 10 వేలు ఇస్తే ఆపిన భాజపా.. రేపు 25 వేలు ఇస్తామనడం హాస్యాస్పదమని వివరించారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరుకు ఆరు కారు... సర్కారు అనే విధంగా ఆరు స్థానాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలను పరిష్కరించే విధంగా పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందని తప్పక మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు టీఆర్ఎస్ఎంఏ మద్దతు ప్రకటించింది.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ