MLC Kavitha On Cancer Awareness: క్యాన్సర్‌తో చనిపోయే వారి సంఖ్య పెద్దఎత్తున పెరిగిపోతోందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. క్యాన్సర్‌ను ముందే గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏఐజీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్దప్రేగు క్యాన్సర్‌పై అవగాహాన కల్పించేందుకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి నుంచి ఖాజాగూడ వరకు సైక్లాథాన్ నిర్వహించారు.
అనంతరం ఏఐజీ ఆడిటోరియంలో కొలొరెక్టల్ క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యకరమైన మితహారాన్ని తీసుకోవాలని ఎమ్మెల్సీ కవితారావు సూచించారు. క్యాన్సర్‌ను మొదట్లోనే గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆమె తెలిపారు. పెద్దప్రేగు జీర్ణ వ్యవస్థకు సంబంధించి అతి ముఖ్యమైనదని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. పెద్దప్రేగు క్యాన్సర్ వల్ల అనేక మంది చనిపోతున్నారని... దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
క్యాన్సర్ బారిన పడి ఈరోజుల్లో చనిపోతున్న వారి సంఖ్య పెద్దఎత్తున పెరుగుతోంది. దీన్ని నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాన్సర్‌పై అవగాహాన కార్యక్రమాలను జిల్లాల్లో చేపడుతోంది. మనం కూడా క్యాన్సర్‌ను ముందే గుర్తించడానికి పరీక్షలను చేయించుకుంటే ప్రాణాలను నిలుపుకోవచ్చు.
- కవిత, ఎమ్మెల్సీ
ఇదీ చదవండి: పంటి బిగువున కష్టాలను భరిస్తూ.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తూ..