ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అభివృద్ధిలోనూ తెరాస పోరాట పటిమ కనబర్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలన్నీ అద్దంలా మెరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో విశ్రాంత ఉపాధ్యాయుల అసోసియేషన్‌తో ఆమె సమావేశమయ్యారు.
గడిచిన ఐదేళ్లలో భాజపాకు చెందిన రామచందర్ రావు చేసిందేమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నా రెడ్డి తెలంగాణ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. వాణీ దేవి కంటే మిగతా పార్టీల అభ్యర్థులకు అర్హత లేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీ దేవిని మేధావులు, పట్టభద్రులు బలపరచాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నారదాసు లక్ష్మణ రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించడం ఖాయం: తరుణ్ చుగ్