రాష్ట్ర శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సయ్యద్ అమీనుల్ హస్సన్ జాఫ్రీ పదవీకాలం మే ఒకటో తేదీన ముగియనుంది. ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వచ్చే నెల 21వ తేదీ నాటికి రెండు స్థానాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.
మరోవైపు, ఎమ్మెల్యేల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు కె.నవీన్‌కుమార్, వి.గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డిల పదవీకాలం కూడా మార్చి 29తో ముగియనుంది. ఈ మూడు స్థానాల ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. గవర్నర్ కోటా సభ్యులు డి.రాజేశ్వర్‌రావు, ఎం.ఎ.ఫరూక్‌హుస్సేన్‌ల పదవీకాలం మే 27న ముగియనుంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు గురువారం విడుదల చేశారు. షాద్‌నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, కందుకూరు డివిజన్లలో కలిపి 8,686 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 4,095 మంది, పురుషులు 4,590 మంది, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
ఏపీలో 14 స్థానాలకు..
ఏపీలో శాసనమండలి ఎన్నికల వేడి మొదలు కానుంది. శాసనమండలిలో స్థానిక సంస్థలు (9), పట్టభద్రులు (3), ఉపాధ్యాయ (2) నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీ కాలం పూర్తికానుండడంతో ఆయా స్థానాలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం పదవీకాలం పూర్తవుతున్న 14 మందిలో 8 మంది తెదేపా సభ్యులే.