MLC Deshapathi Srinivas Fires on Jeevan Reddy : తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ హైకమాండ్ చేసిన అన్యాయంపై మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడితే తప్పేముందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మీద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దేశపతి శ్రీనివాస్ ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్(Assembly Media Point) వద్ద ఆయన ఈ మేరకు మాట్లాడారు.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ కించపరిచిందని చెప్పే క్రమంలో పీవీని అవమానించిన తీరును హరీశ్‌రావు శాసనసభలో వివరించారని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. పీవీ(PV Narasimha Rao) కాంగ్రెస్ వాది కాదనడం లేదని, అయితే కాంగ్రెస్ వాదిగా పీవీని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తించలేదని, పీవీకి అవమానకర పద్ధతుల్లో అంత్యక్రియలు జరిగాయని ఆయన ఆరోపించారు. దివంగత కాంగ్రెస్ పీఎంలకు దిల్లీలో స్మారక స్థలాలు ఉన్నాయి కానీ, తెలంగాణ బిడ్డ పీవీ స్మారక స్థలం ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. పీవీ శతజయంతి వేడుకలు తెలంగాణలో కేసీఆర్ ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై 7 మండలాలు లాక్కున్నారు : పీవీ శత జయంతి(PV Centenary) వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు అడిగారా అని ఎమ్మెల్సీ దేశపతి ప్రశ్నించారు. సీలేరు విద్యుత్ కేంద్రంతో పాటు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని అంటున్నారు కదా, అప్పుడు పోరాడింది బీఆర్ఎస్ పార్టీనే అని పేర్కొన్నారు. అప్పుడు 70-80 మంది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారని, అయినా తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కి అప్పుడు కేవలం కేకే ఒక్కరే రాజ్యసభ సభ్యుడు ఉన్నారని, ఆయనే మాట్లాడారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై 7 మండలాలు లాక్కున్నారని ఆరోపించారు.
Deshapathi Srinivas vs Jeevan Reddy : కోచ్ ఫ్యాక్టరీ గురించి కాంగ్రెస్ ఎంపీలు ఏనాడూ అడగలేదని, కాళేశ్వరం అవినీతి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు కానీ కోచ్ ఫ్యాక్టరీ గురించి అడగలేదని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం బియ్యం కొనలేము అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదని అన్నారు. బీఆర్ఎస్ పోరాటం చేసిందని, కాంగ్రెస్ పదవుల కోసం పెదవులు మూసుకుందని ధ్వజమెత్తారు. హరీశ్‌రావును తిడితే మంత్రి పదవి వస్తుందని జీవన్ రెడ్డి అనుకుంటున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy)కి మంత్రి అయ్యే హక్కు ఉందన్నారు. చాలా మంది పార్టీలు మారారు కానీ జీవన్ రెడ్డి మారలేదన్నారు. అందుకైనా జీవన్ రెడ్డి మంత్రి కావాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆకాంక్షించారు.
'బీఆర్ఎస్ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు - కాళేశ్వరం అవినీతి బయటపెడతాం'
కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ - విచారణ జరిపించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి