Station Ghanpur MLA Rajaiah On MLA Ticket : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్ఠానం తనకు సీటు కేటాయిస్తుందన్న విశ్వాసం ఇంకా ఉందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటూ పరిశీలిస్తు బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్..(KCR) తనకు టికెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో తెలంగాణ రైతుబంధు సమితి కార్యాలయంలో రైతుబంధు సమితి రాష్ట్ర (Raithu Bandu) అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం తనకు అప్పగించిన ఈ అదనపు బాధ్యతల ద్వారా రైతులకు సేవ చేస్తానని రాజయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న రైతుబంధు సమితి సభ్యుల సేవలు మరింత విస్తృతం చేసి రాబోయే రోజుల్లో అన్నదాతకు చేరువై అన్నిరకాల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
"స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. అదనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చారు. ఇలా రైతులకు సేవ చేస్తాను. ఎమ్మెల్యే అభ్యర్థులు మారే అవకాశం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ రోజు సర్వే రిపోర్టులు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నారు. నాకు టికెట్ ఇస్తారని ఇంకా నమ్మకం ఉంది." - తాటికొండ రాజయ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే
Station Ghanpur MLA Rajaiah No Compromise on MLA Ticket : కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ (BRS MLA Candidates List) ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య చాలా కాలంగా పోటీ సాగింది. ఈ నేతలిద్దరు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య అసంతృప్తి చెందారు. మరోసారి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారన్నా ధీమాతో ఉన్న రాజయ్యకు.. అధిష్టానం నిర్ణయం పెద్ద షాక్కే గురిచేసింది. ఆయనను సంతృప్తి పరిచేందుకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది.
Mla Rajaiah Fire On Mlc Kadiyam : మరోసారి కడియంపై రాజయ్య ఫైర్