mla rajagopal reddy Comments:
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అధికార నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయంగా తలపడలేక తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి... కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం కోసం గొంతు వినిపించిన వ్యక్తినని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వట్లేదని ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తుంటే.. కాంట్రాక్టర్ అంటున్నారని ఆవేదన చెందారు. ''కాంట్రాక్టర్‌గా ఉండటం తప్పా? అది తప్పుడు వ్యాపారమా?'' అని ప్రశ్నించారు. కాంట్రాక్టులు అడ్డుకున్నా... అధికార పార్టీకి లొంగలేదని పేర్కొన్నారు. సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు ఇచ్చి కమీషన్లు దోచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సింగరేణిలో రూ.20వేల కోట్లు అవినీతి జరిగిందని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెప్పారు. తనను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు ఆలోచించి కుటుంబ పాలనను అంతమొందించాలన్నారు.
అసలేం జరిగిందంటే...
అసెంబ్లీలో మంత్రి తలసాని రాజగోపాల్‌రెడ్డిని కాంట్రాక్టర్‌గా సంబోధించడంతో అక్కడ వాగ్వదం మొదలైంది. దీనితో రాజగోపాల్‌రెడ్డి మంత్రి తలసానిపై విరుచుకుపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలని తెరాస శాసనసభ్యులందరూ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ