భాజపా భయంతోనే ఉపాధ్యాయ, ఉద్యోగులను మంచి చేసుకునే పనిలో భాగంగానే కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. నాణానికి బొమ్మతో పాటు.. బొరుసు కూడా ఉంటుందని స్పీకర్, మంత్రులు హరీశ్, ప్రశాంత్ రెడ్డిలు గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు తప్పనిసరి పరిస్థితుల్లోనే సీఎం చిత్రపటానికి పాలభిషేకాలు చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథలో తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను నియమించి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
శాసనసభలో కేంద్రంపై మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ఆర్థికమంత్రికి జ్ఞానోదయం చేసేవాడినన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించక పోవటం వల్లనే ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యం అయిందని చెప్పారు. ఐటీఐఆర్, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై మంత్రి హరీశ్ రావు నిండు సభలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని పెంచి అప్పులు తెచ్చుకునే అవకాశం కేంద్రం ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మీద ఎంత అప్పు ఉందో హరీశ్ రావు సభలో చెప్పగలరా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి : 'భాజపా ఒత్తిడి వల్లే ప్రభుత్వం పీఆర్సీ'