Raghunandan Rao on ORR Controversy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల ప్రక్రియను ప్రజల ముందు ఎందుకు బహిర్గతం చేయలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పెద్దల స్నేహితుల కంపెనీకి ఓఆర్‌ఆర్‌ను లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ఐఆర్‌ఎల్ కంపెనీ టెండర్ వేసిన మొత్తం కంటే.. ప్రభుత్వం ఎక్కువ చెప్పిందని, దీని వెనుక రహస్యం ఏంటని నిలదీశారు.
'ఐఆర్‌ఎల్ కంపెనీ రూ.7 వేల 272 కోట్లకు మాత్రమే టెండర్ వేసింది. టెండర్ ద్వారా రూ.7 వేల 380 కోట్లు వస్తోందని ప్రభుత్వం చెప్పింది. టెండర్ వేసిన మొత్తం కంటే ఐఆర్‌ఎల్ ఎందుకు ఎక్కువ ఇస్తోంది.' అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బిడ్ ఓపెన్ తర్వాత బేరమాడి ఐఆర్‌ఎల్‌కే అప్పగించారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అంశంపై పలు ప్రశ్నలు లేవనెత్తిన రఘునందన్ రావు.. ఏప్రిల్ 11న ఓపెన్ చేసిన బిడ్‌ను ఏప్రిల్ 27 వరకు ఎందుకు వెల్లడించలేదని అన్నారు.
Hyderabad Outer Ring Road Lease Issue: క్రిసిల్ అనే సంస్థ రిపోర్టు ప్రకారం.. ఎందుకు టెండర్లు పిలవలేదని మండిపడ్డారు. 30 ఏళ్లలో వచ్చే ఆదాయాన్ని లెక్క గట్టి లీజుకు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించిన ఆయన.. అదానీ కంపెనీ రూ.13 వేల కోట్లకు టెండర్ వేసేందుకు సిద్ధమైతే ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గిందని మండిపడ్డారు. నూతన సచివాలయంలోకి ఎమ్మెల్యేలను వెళ్లనీయడం లేదని ఆరోపించిన ఆయన.. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇవ్వాలన్నారు.
"ఓఆర్‌ఆర్ టోల్ గేట్ ద్వారా ప్రతి రోజు వస్తున్న ఆదాయం ఎంత..? ఏప్రిల్ నెలలో ఎంత ఆదాయం వచ్చింది..? ఐఆర్‌బీ కంపెనీకి ఓఆర్‌ఆర్ కాంట్రాక్టు దక్కింది. బిడ్ ఓపెన్ చేసిన వెంటనే ఎందుకు చెప్పలేదు. ఐఆర్‌బీ కంపెనీని గతంలో హెచ్‌ఎండీఏ డిఫాల్టర్‌గా ప్రకటించింది. రూ.7 వేల 272 కోట్లకు ఆ సంస్థ కోట్ చేసింది. మరి రూ.7 వేల 380 కోట్లకు ఆ కంపెనీ దక్కించుకుందని ఎలా ప్రకటించారు. అర్వింద్ కుమార్ ఫోన్ కాల్ వివరాలు బయట పెట్టాలి. రోజూ ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్ టోల్ కోసం ఈ ప్రభుత్వం ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదు. ఈ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలి.. లేకుంటే మేము న్యాయస్థానానికి వెళ్తాం."- రఘునందన్‌రావు, ఎమ్మెల్యే
ఇవీ చదవండి:
REVANATH on ORR: 'రూ. 1000 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం'
CM KCR Review: ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష
రాహుల్‌కు నిరాశ.. పరువు నష్టం కేసులో స్టేకు హైకోర్టు నో.. తీర్పు రిజర్వ్