మహబూబాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ పోటీ చేసి ఓడిపోయారు. తెరాస అభ్యర్థి మాలోతు కవిత లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇంతకుముందు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగిన ఆయన గులాబీ పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. భాజపా అభ్యర్థి హుస్సేన్ నాయక్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఆదిలాబాద్ లోక్‌సభకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాఠోడ్.. భాజపా అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి.. తెరాస అభ్యర్థి రేఖనాయక్ చేతిలో ఓడిపోయారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన హస్తం పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి బండి సంజయ్ గెలుపొందగా.. గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన పొన్నం మూడో స్థానంలో నిలిచారు.
మెదక్ పార్లమెంట్ స్థానంలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు.. తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. గత డిసెంబర్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘునందన్ రావు.. సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన కమలం పార్టీ అభ్యర్థి రాంచందర్ రావు.. మూడో స్థానంలో నిలిచారు. శాసన సభ ఎన్నికల్లో రాంచందర్ రావు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాభవం పొందారు. హైదరాబాద్ లోక్‌సభకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓడిపోయారు. శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీకి పోటీ చేసి... జాఫర్ హుస్సేన్ చేతిలో పరాజయం పాలయ్యారు.
పాలమూరు లోక్‌సభకు పోటీపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి.. కారుముందు నిలవలేకపోయారు. అంతకుముందు హస్తం పార్టీ తరఫున కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్ చేతిలో ఓడిపోయారు. పార్టీ మారినా.. గద్వాల జేజమ్మ డీకే అరుణ తలరాత మారలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి భాజపా తరఫున బరిలో నిలిచినా.. ఆమె ఓటమిని చవిచూడక తప్పలేదు. తెరాస అభ్యర్థి మన్నె శ్రీనివాస రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. సొంత మేనల్లుడు, గులాబీ పార్టీ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు పోటీ చేసిన మల్లు రవి ఓటమిని తప్పించుకోలేకపోయారు. గులాబీ పార్టీ అభ్యర్థి పి. రాములు చేతిలో 87 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్లు రవి జడ్చర్ల శాసనసభ స్థానానికి పోటీ చేసి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇవీ చూడండి: చేవెళ్లలో కారు జోరు...హస్తం వ్యస్థం