దేశంలో వ్యాపారాలన్నీ కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. నల్లధనం తెస్తామన్న ప్రధాని మోదీ మాటలపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెరాస కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భువనగిరిలో ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన చదువుకున్నారో లేదో తెలియదు కానీ.. పట్టభద్రుల ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందని కిశోర్ ఎద్దేవా చేశారు.
మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోనే పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా ఓడిపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అసలు పోటీలోనే లేవన్నారు. బండి సంజయ్ ప్రేలాపనలు ఆపకపోతే కరీంనగర్ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గాదరి కిషోర్ అన్నారు. భాజపా అధ్యక్షుడు పట్టభద్రులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. ఐటీఐఆర్‌పై భాజపా నేతలకు స్పష్టత లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడి మాట అక్కడే మాట్లాడుతున్నారని సైదిరెడ్డి ఆరోపించారు.