Etela Comments On CM KCR: రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు కార్మికులను పర్మినెంట్ చేయడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే, భాజపా నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు.. కానీ శాశ్వతంగా ఉండేది కార్మికుల సంఘం మాత్రమేనని ఈటల స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సెల్ క్యాలెండర్‌ను ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.
రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదన్న కేసీఆర్.. ఇప్పుడు కాంట్రాక్టు కార్మికులను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదు.? సీఎంలు ఉంటారు పోతారు.. శాశ్వతంగా ఉండేది కార్మిక సంఘాలే. గతంలో కార్మిక యూనియన్లను నమ్మకున్న కేసీఆర్.. ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదు. -- ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
రాష్ట్రంలో బల్దియా కార్మికుల దుస్థితి మారలేదని.. కార్మికుల భవిష్యత్తు కోసం పోరాడాలని ఈటల సూచించారు. గతంలో కార్మిక యూనియన్లను నమ్మకున్న కేసీఆర్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 2008లో 1700 మంది కార్మికులను తొలగిస్తే పదవిని పక్కనపెట్టి జీహెచ్‌ఎంసీ కార్మికులకు తాను అండగా ఉన్నానని ఈటల చెప్పారు. అందరికీ అండగా ఉంటానని... బల్దియా కార్యాలయానికి మళ్లీ మళ్లీ వస్తానని ఈటల స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నేత స్వామిగౌడ్, ఇతర బీజేఎంసీ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KTR Comments: జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ: కేటీఆర్