మిషన్ భగీరథ... రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు శుద్ధి చేసిన నదీ జలాలను సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. ప్రస్తుతం రాష్ట్రంలోని 54 లక్షల ఇళ్లకు నల్లాల ద్వారా భగీరథ జలం సరఫరా అవుతోంది. బాహ్యవలయ రహదారి వెలుపల ఉన్న పట్టణ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన జలాలను బల్క్‌గా సరఫరా చేస్తున్నారు. వంద శాతం ఇళ్లకు నల్లానీటిని అందిస్తున్న రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఇటీవలే ప్రకటించగా... ప్రాజెక్టు పూర్తైనట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ మిషన్ భగీరథ జలాలను వినియోగించేలా అవగాహనా కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించింది. నీటిశుద్ధి కేంద్రాల వద్ద స్థానిక ప్రజాప్రతినిధులకు ఇప్పటికే అవగాహన కల్పించిన అధికారులు.... గ్రామాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ప్రజలను ప్రోత్సహించాలి
మిషన్ భగీరథ నీటిని తాగాలంటూ ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఆరోగ్యకరమైన, పరిశుద్ధమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని సీఎం కోరారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో... స్వయంగా తాము కూడా అదే నీటిని తాగాలని సంబంధిత శాఖ అధికారులు, ఇంజినీర్లు నిర్ణయించారు. అందుకనుగుణంగా అన్ని మిషన్ భగీరథ కార్యాలయాల్లో వినియోగించేలా బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
వీలైనంత ఎక్కువగా
బాటిళ్ల ద్వారా కూడా మిషన్ భగీరథ జలాలు అందుబాటులోకి వచ్చినందున గ్రామపంచాయతీ మొదలు రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల స్పష్టం చేశారు. అందుకనుగుణంగా రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు మిషన్ భగీరథ బాటిళ్లను సరఫరా చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో వీలైనంత ఎక్కువగా అవగాహన కల్పించేలా అన్ని మండల, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఈ నీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు.
ప్రగతిభవన్‌కు భగీరథ నీళ్ల బాటిళ్లు
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌కు కూడా మిషన్ భగీరథ బాటిళ్లనే సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష సందర్భంగా ఈ బాటిళ్లనే వినియోగించారు. కాగా.. ప్రభుత్వ కార్యాలయాలకు బాటిళ్లను ఉచితంగానే సరఫరా చేస్తున్నారు. బాటిళ్లపై ఈ విషయాన్ని స్పష్టంగా ముద్రిస్తున్నారు. ప్రస్తుతానికి 300 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన లక్ష బాటిళ్లను తయారు చేస్తున్నారు. మేడ్చల్ సమీపంలోని ఓ యూనిట్లో ప్రస్తుతం బాటిళ్లను తయారు చేస్తున్నారు. మిషన్ భగీరథ ప్లాంట్లలోని జలాలను వాటిలో నింపి, ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 50 మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాల వద్ద యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ: గవర్నర్