Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. మిషన్ భగీరథ పెట్టినప్పటి నుంచి తెలంగాణ ఆడబిడ్డలకు నీటి కష్టాలు తప్పాయి. ఒకప్పుడు నీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ మహిళలు.. ఇప్పుడు ఇంటికే నీరు వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతి ఇంటికి తాగు నీటిని సప్లై చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాగా ఈ సంవత్సరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు మంచి నీళ్ల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటిని ఎలా శుభ్రం చేస్తారు అని వారికి తెలియజేస్తున్నారు. నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి అని సూచనలిస్తున్నారు.
పొయ్యి కాడికే నీళ్లు..: స్వరాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీరాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛ జలాలు వచ్చేశాయి. 100 శాతం తాగు నీటిని అందిస్తున్న అతిపెద్ద ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించిన నేపథ్యంలో రాష్ట్రంలో "మంచి నీళ్ల పండుగ" ఘనంగా సాగుతోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఊరూ వాడా ప్రశాంత వాతావరణం నడుమ మంచినీళ్ల పండుగ ఉత్సాహపూరితంగా మొదలైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
Mission Bhagiratha achievements : ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ నీటి శుద్ది కేంద్రాలు, గ్రామాల్లో పండగ వాతావరణం దర్శనమిస్తోంది. గ్రామాల్లో గ్రామస్థులతో కలిసి మిషన్ భగీరథ ఉద్యోగుల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మంచి నీళ్ల కోసం పడ్డ తిప్పులు.. నేడు గడప ముంగటికే నీళ్లు వస్తున్న విధానాన్ని మిషన్ భగీరథ ఉద్యోగులు వివరిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న ఓహెచ్ఆర్ఎస్‌ల దగ్గర రంగు రంగుల ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్ది మహిళలు సంబురాలు చేసుకుంటున్నారు. ట్రీట్ మెంట్ ప్లాంట్లలో జరిగే నీటి శుద్ది ప్రక్రియను స్కూలు పిల్లలు, గ్రామస్థులకు ఉద్యోగులు చూపిస్తున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తూ: ప్రజారోగ్యం దృష్ట్యా తాగు నీటి సురక్షిత వాడకం, పొదుపుపై మిషన్ భగీరథ ఉద్యోగులు గ్రామస్థులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. మరోవైపు, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీరు పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమైంది. తెలంగాణలో 23,839 గ్రామీణ ఆవాసాల్లో 57.01 లక్షల ఇళ్ళలో, మున్సిపాలిటీల్లో విలీనమైన మరో 649 గ్రామీణ ఆవాసాలు, 121 మున్సిపాలిటీలకు, అడవులు, కొండలపైన ఉన్న 136 గ్రామీణ ఆవాసాలకు మిషన్ భగీరథ స్వచ్ఛ జలాలు సరఫరా అవుతున్నాయి.
ఇవీ చదవండి: