గ్రామీణ ప్రాంతాల్లో ఆగ్రోస్ సేవా కేంద్రాల సేవలను భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లల్లో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర వ్యవసాయ యంత్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఇంతకుముందు మైత్రివనంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని నాంపల్లికి తరలించారు.
టీఎస్ ఆగ్రోస్ సంస్థను రూ.6 కోట్ల నుంచి రూ.151 కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకొచ్చిన ఎండీ రాములును మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పట్టభద్రులు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ ఆధ్వర్యంలోని ఆగ్రోస్ సేవా కేంద్రాలను ఇప్పుడు 1,100కు పైగా పెంచామని తెలిపారు.
కరోనా వల్లే కొనుగోళ్లలో జాప్యం.
కరోనా వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రవాణా, సరఫరాలో జాప్యం జరుగుతోందని తెలిపారు. దాదాపు 6 వేలకు పైగా కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నామన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారుల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి, టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ కె.రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.