Ministers on IT Raids on Mallareddy: ఓ వైపు ఎమ్మెల్యే ఎర కేసు.. దిల్లీ మద్యం కుంభకోణం విచారణ వేళ రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారంలో ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ తనిఖీలు నిర్వహించగా.. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. దీనిపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కేంద్ర సంస్థల దాడులను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు.
తెరాస నేతలపై ఐటీ, ఈడీ దాడులను ముందే ఊహించామని.. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కేంద్ర సంస్థల దాడులను సమర్థంగా ఎదుర్కొంటామన్న ఆయన.. తెరాస నేతలను లక్ష్యంగా చేయడం సరికాదన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి విధానాలు ఎప్పుడూ చూడలేదన్న తలసాని.. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని వ్యాఖ్యానించారు. లక్ష్యంగా చేస్తున్న దాడులకు తెరాస నాయకత్వం భయపడదన్నారు.
'కేంద్ర సంస్థలు చేస్తున్న దాడులను ఎదుర్కొంటాం. ఈ దాడులు ముందే ఊహించాం, సీఎం ముందే చెప్పారు. ఈరోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు, రేపు మా చేతిలో ఉండొచ్చు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు. జరుగుతున్న పరిణామాల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. ప్రజలను చైతన్యం చేసి మేం ఏంటనేది వ్యవస్థలకు చూపిస్తాం. రొటీన్‌గా చేసే దాడులను ఎవరూ తప్పుపట్టరు. అంత భయపడితే హైదరాబాద్‌లో ఎందుకు ఉంటాం. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూస్తారు.'- తలసాని శ్రీనివాస్‌యాదవ్, పశు సంవర్ధక శాఖ మంత్రి
కేంద్రం చర్యలకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది..: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు దారుణమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దర్యాప్తు సంస్థల ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం చర్యలకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రాలను కలుపుకొని కేంద్రం పని చేయడం మానుకొని.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఏర్పాటుచేసిన ఎన్జీవో క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఉద్యోగులకు ఆట విడుపుగా మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
27న తెరాస జనరల్ బాడీ సమావేశం..: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చించినట్లు తలసాని తెలిపారు. ఈ నెల 27న ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్‌లో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తామని పెర్కొన్నారు. ఆ సమావేశంలో అనేక అంశాలపై చర్చిస్తామన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు డివిజన్ల వారీగా లేక నియోజకవర్గాల వారీగా చేయాలా అనే అంశంపై చర్చించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చించామన్నారు. ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయని తాము ముందు నుంచే చెబుతున్నామని తెలిపారు. తాము చెప్పినట్లే దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దాడులు ఇక్కడ మాత్రమే కాదు తమిళనాడు, బెంగాల్, యూపీల్లో కూడా చేశారన్నారు. ఈ క్రమంలోనే 18 రాష్ట్రాల్లో భాజపా పాలిస్తుంది.. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఒక్క పథకాన్నైనా అమలు చేయమంటే చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: