Ministers Serious on Medigadda barrage Issue : సాంకేతిక పరిజ్ఞానం కాలంలోనూ ఆనకట్ట కుంగిపోవటం ప్రపంచం ముందు తలదించుకునే పరిణామమని రాష్ట్ర మంత్రులు అభివర్ణించారు. పేరు కోసం ఆతృత, హడావిడిగా ప్రాజెక్టు(Medigadda Barrage) నిర్మించి రాష్ట్ర ప్రయోజనాలను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా అధికారుల ముందు పలుసందేహాలను లేవనెత్తిన మంత్రులు, ఇంజినీర్లు వాస్తవాలు చెప్పాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మించిన సమయంలో ఉన్న అధికారులపై ఆధారపడకుండా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.
Minister Komati Reddy Comments on Kaleshwaram Project : ప్రాణహిత పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం(Kaleshwaram Project) చేపట్టిందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తమ్మిడి హట్టి వద్ద 3వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? ఆయనే చీఫ్ ఇంజినీర్‌గా చేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్(KCR) చర్యలు చూసి ఇంజినీర్లు అప్పుడే సెలవు పెట్టి పోవాల్సిందన్నారు.
కొండ పోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుందని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుపై ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తోందని ప్రశ్నించారు. ఇంజినీర్లు చెప్పింది వినలేదు, ఇప్పుడు జరిగిన ఈ నష్టాన్ని ఎవరు భరించాలని ఆయన ధ్వజమెత్తారు.
"ప్రాణహిత పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే గత ప్రభుత్వం కాళేశ్వరం చేపట్టింది. తమ్మిడి హట్టి వద్ద 3000 ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవి. కేసీఆర్ ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? ఆయనే చీఫ్ ఇంజినీర్‌గా చేశారా? ఆయన చర్యలు తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయి." - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి
కోతకు గురైన మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట.. 100 మీటర్ల మేర!
మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ : కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాశ్వేశ్వరం కోసం ఎంత విద్యుత్ వాడారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రయోజనం లేకుండా పెట్టిన పెట్టుబడితో, కేసీఆర్ మానస పుత్రిక పరిస్థితి ఇప్పుడు ఏంటని గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కూలినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు కూలిందో స్పష్టంగా చెప్పలేకపోయిందని విమర్శించారు. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
"కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక. ఈ ప్రాజెక్టు కోసం ఎంత విద్యుత్ వాడారు. ప్రయోజనం లేని వాటికి పెట్టుబడి పెట్టిన మానస పుత్రిక పరిస్థితి ఏంటి? మేడిగడ్డ బ్యారేజీ కూలినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు కూలిందో చెప్పలేదు." - పొన్నం ప్రభాకర్, మంత్రి
Minister Ponguleti Srinivas Reddy Fires on BRS : కేసీఆర్ మార్కు ఉండాలనే తాపత్రయం తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. డయా ఫ్రాం వాల్(Dia from Wall) ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. సీకెండ్ ఫైల్ ఫెయిల్ అయినందుకే రోజురోజుకు కుంగిపోయిందని చెప్పారు. ప్రొటెక్షన్ పనులు ఒక్క వరదకే పోతే పనులు ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోందన్నారు. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈ పై అధికారులకు లేఖ రాశారన్నారు. ఈ లేఖలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
"వృథా కింద ఎంత ఇసుకను తొలగించారు? ఎవరికి ఇచ్చారు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగుతుందని నేను అనుకోవడం లేదు. ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి నిర్మించిన ఆనకట్టలు ఇవి. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ఇంజినీర్లు ఆనాడే ఎందుకు స్పష్టం చేయలేదు? పంపులు మునగడానికి కారణం ఎవరు? సరైన లెవల్‌లో కట్టి ఉంటే పంపులు మునిగేవి కాదు కదా? పంపు హౌస్‌లోని స్టాప్‌లాక్ గేట్స్ పనిచేశాయా? డిజైన్లు ఆమోదించింది ఎవరు? కనీసం సమీక్షించారా? ఏ చట్టం ప్రకారం పంపుల మరమ్మత్తుల కోసం ఏజెన్సీకి డబ్బులు ఇచ్చారు. ఇంత భారీ ఖర్చు చేసి ఐదేళ్లలో కేవలం 50 టీఎంసీలు మాత్రమే ఎత్తి పోశారు. వందల కోట్లు వృథా అని తెలిసినా పైప్‌లైన్ ఎందుకు చేపట్టారు." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి
నిర్మాణంలో చూపిన అత్యుత్సాహం నిర్వహణలో చూపలేదు : కేసీఆర్, అధికారులు కలిసి చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. నిర్మాణంలో చూపిన అత్యుత్సాహం నిర్వహణలో ఎందుకు చూపలేదన్నారు. ఈ అన్ని అంశాలపై విచారణ జరిపి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.