Ministers Review On Covid: రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కలెక్టర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో... అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
కలిసికట్టుగా కట్టడి చేద్దాం
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై సమావేశంలో చర్చించినట్లు హరీశ్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై... కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఫీవర్ సర్వేతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. పకడ్బందీగా జ్వర సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని హరీశ్... కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్‌లోనూ వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు.
రేపటి నుంచే
రాష్ట్రంలో మెడికల్ కిట్ల పంపిణీ అనేది దేశానికే ఆదర్శం. కరోనా కేసుల దృష్ట్యా ముందు జాగ్రత్తగా రేపటి నుంచి ఫీవర్ సర్వే చేయనున్నాం. అధికారులే ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేస్తారు. 2కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వనున్నాం. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ సూచనలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలి. --- హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఆక్సిజన్ పడకలు సిద్ధం
కరోనా చికిత్స కోసం జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారని హరీశ్ అన్నారు. అన్ని పడకలకు ఆక్సిజన్ సిద్ధం చేశామని.. రాష్ట్రంలో ప్రస్తుతం 340 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థ్యం ఉందని చెప్పారు. మరింత ఆక్సిజన్ సామర్థ్యం పెంచుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. బూస్టర్ డోసు ప్రజలకు అందించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి హరీశ్ పేర్కొన్నారు. కొవిడ్ పరీక్షల కోసం ఎంతమంది వచ్చినా అందరికీ టెస్టులు చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: Minister Srinivas Goud Fire on BJP: 'కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా... టచ్ చేసి చూడండి'