Ministers Review Irrigation Department Officials : ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల నీటిపారుదల అంశాలపై, సచివాలయంలో సుదీర్ఘ సమీక్ష జరిగింది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రెండు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Ministers Review Joint Nalgonda District Pending Irrigation Projects : సీతారామ ప్రాజెక్టు (Sitarama Project), డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లెంల, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, నక్కలగండి, చర్ల రిజర్వాయర్లు, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాల్వల పెండింగ్ పనులు, వాటి పురోగతిపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను, రీ డిజైనింగ్ పేరిట రూ.13,000ల కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులను ప్రశ్నించారు.
అదనంగా ఆయకట్టు పెరిగిందా : ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచితే అదనంగా ఆయకట్టు పెరిగిందా అన్న భట్టి ప్రశ్నకు, ఏ మాత్రం పెరగలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఆయకట్టు పెంచకుండా రీ డిజైనింగ్ పేరిట ప్రాజెక్టు అంచనాలను పెంచి, ప్రజా సంపద దుర్వినియోగం చేయడం సరికాదని మంత్రులు పేర్కొన్నారు.
అధికారులు నిజాలను దాచిపెట్టకుండా వాస్తవాలు చెప్పాలి : సీతారామ ప్రాజెక్టు పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు, బ్యారేజ్ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. హెడ్‌వర్క్ దగ్గర పనులు పూర్తి చేయకుండా, చివరి కాలువల వద్ద పనులు పూర్తి చేసి, ప్రాజెక్టు పురోగతిలో ఉందని చెబితే ప్రయోజనం ఏంటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అధికారులు నిజాలను దాచిపెట్టకుండా వాస్తవాలు చెప్పాలన్నారు.
గత పదేళ్లలో అదనంగా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా?: శబరి, గోదావరి నదులు కలిసిన చోట 365 రోజుల పాటు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాంతాన్ని విస్మరించి, సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైనింగ్ చేసి, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినందున అంచనా వ్యయం పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. అంతే తప్ప పదేళ్లలో ఒక ఎకరాకైనా అదనంగా నీళ్లిచ్చారా అని అధికారులను నిలదీశారు. గతంలో రూపొందించిన ఇందిరాసాగర్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగిస్తే ఇప్పటి వరకు పనులు పూర్తై, నీళ్లు వచ్చే అవకాశం ఉండేదని, ప్రాజెక్టు డిజైనింగ్ సరిగానే ఉందని అధికారులు చెప్పారు.
పరిహారం ఇవ్వకుండా పరిహాసం.. అధికారులపై పిప్పల్‌కోటీ నిర్వాసితుల ఆగ్రహం
గత ప్రభుత్వ విధానపర నిర్ణయంతో ఇందిరాసాగర్‌ను రీ డిజైనింగ్ చేసినట్లు అధికారులు వివరించారు. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలకు, ఇప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సాగర్ ఎడమకాలువ ద్వారా ఏపీకి నీళ్లు వెళ్లే జోన్ -3లోనే, ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలు ఉన్నాయని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లవుతున్నా వాటిని జోన్ -2 లోకి మార్చాలని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని భట్టి ఆరోపించారు.
Ministers Review Joint Khammam District Pending Irrigation Projects : మొదటి ప్రాధాన్యతగా తీసుకొని వీలైనంత త్వరగా జోన్ -3 లో ఉన్న గ్రామాలను, జోన్-2 లోకి మార్చాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రం వచ్చే నాటికి మధిర నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న జాలుముడి, మున్నేరు ఆనకట్టలను పూర్తి చేయకుండా, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
ప్రాజెక్టుల పూర్తికి కావల్సిన అంచనా వ్యయాలు రూపొందించాలి : వాటి పూర్తికి కావలసిన అంచనా వ్యయాలను రూపొందించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేసి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు నత్తనడకగా సాగడం విచారకరమని పేర్కొన్నారు. తక్కువ అంచనా వ్యయంతో పెండింగ్‌లో ఉండి, 90 శాతం పైగా పూర్తయిన ప్రాజెక్టులను గుర్తించి, పూర్తికి కావలసిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని, భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Chanaka Korata project: పనులన్నీ పూర్తాయే.. పరిహారం ఇంకా రాకపాయె
పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించాలి : హెడ్ వర్క్స్ పూర్తిచేయకుండా చివరి కాలువలు పూర్తి చేసుకుంటే ఫలితం ఏమంటుందని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులను ప్రశ్నించారు. రూ.200, రూ.300 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులను, గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి, వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించాలని ఉత్తమ్ అదేశించారు.
ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలి : ఆరు నెలలు, ఏడాది, 18 నెలలు, రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి, వాటికి కావాల్సిన అంచనా వ్యయంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, పనులు కేటాయించిన వాటిని కూడా ఆపివేయాలని ఆదేశించారు. చెరువుల మరమ్మతులు, చెక్‌డ్యాంల నిర్మాణం కోసం, ఎమ్మెల్యేల నుంచి వచ్చే సిఫారుసులను స్వీకరించి, వాటికి కావలసిన నిధుల మంజూరుకు కృషి చేయాలని ఆదేశాలిచ్చారు.
నిధులివ్వని బ్యాంకులు... ప్రశ్నార్థకంగా మారిన ఐదు ప్రాజెక్టుల పరిస్థితి
ఇది బ్యాడ్ రీ డిజైనింగ్‌లా ఉంది : గత ప్రభుత్వం రీ డిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టుతో ముందుకు, వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇది బ్యాడ్ రీ డిజైనింగ్‌లా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా చెప్పని అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ హెడ్‌వర్క్ నుంచి చివరి కాలువ వరకు దశల వారీగా జరిగిన పనుల గురించి ఆయన అధికారులను అడిగారు. తత్తరపాటు సమాధానాలు చెప్పడంతో చేసే పనిపై అధికారులకే అవగాహన లేకుంటే ఎలా అంటూ ఈఈని మందలించారు.
నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడలేని నిర్లక్ష్యం : గత ప్రభుత్వంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై, ఎక్కడలేని నిర్లక్ష్యం వహించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (KomatiReddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ఇంకా ఎందుకు పూర్తి కాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీని నిలదీశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు (Udaya Samudram Project) 2014 నాటికే 90 శాతం పూర్తైనా, పదేళ్లలో 10 శాతం పనులను పూర్తిచేయలేదన్న మంత్రి, ఇవి పూర్తయితే లక్షకు పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు.
Pending Irrigation Projects in Telangana : డిండి, సింగరాజుపల్లి, పెండ్లి పాకాల, గొట్టెముక్కుల రిజర్వాయర్లు, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ ఎత్తిపోతల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఇక నుంచి జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు.
Telangana Budget 2023-24 : తెలంగాణ బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకే పెద్దపీట
డిండి, ఉదయ సముద్రం , బ్రాహ్మణ వెల్లెంల, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, నక్కల గండి, రిజర్వార్ల పనులు, పిల్లా, ధర్మారెడ్డి కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పూర్తికి తగినంత బడ్జెట్ కేటాయించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆయన సూచించారు. జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి, పనులు త్వరగా అయ్యేలా చూడాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు.
నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న నీటి నిల్వలు, వాటి వాడకం గురించి సమావేశంలో మంత్రులు చర్చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. వృథా ఖర్చులను అరికట్టి, తక్కువ వ్యయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఆశించినంత నీరు లేక ప్రాజెక్టులు వెలవెల - యాసంగి సాగుకు తిప్పలు తప్పేట్టులేవుగా