BC Trust Bhavans: ప్రభుత్వాధినేతలు ఎందరు మారినా... బీసీల బతుకులు మాత్రం మారలేదని మంత్రులు గంగుల, తలసాని, వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో మేరు, మేదరి ఆత్మగౌరవ ట్రస్టు భవనాల భూమిపూజలో మంత్రులు పాల్గొన్నారు. 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం రూ. 5వేల కోట్ల విలువైన భూములను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీఎం కేసీఆర్... కేటాయించారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీల సంక్షేమం కోసం పథకాలు అలుచేస్తున్నట్లు మంత్రులు వివరించారు. ఆత్మగౌరవ ట్రస్టు భవనాల భూమి పూజలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలత, బీసీ కమిషనర్ వకుళాభరణం కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
అందరు మారినా గాని బీసీల బతుకులు మాత్రం మార్చలేకపోయారు. ఈ సమాజంలో 60 శాతం జనాభా ఉన్న నా బీసీ బిడ్డలను నేను కాపాడుకోవాలని చెప్పి ప్రప్రథమంగా సీఎం కేసీఆర్ 80 ఎకరాల భూమిని బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించారు.
-- గంగుల కమలాకర్, మంత్రి
ఇవన్నీ కులాలు కావు, వృత్తులు. రాజ్యాంగంలో కులాలు అని పొందపర్చడం వల్ల విడిపోయారు. అంతేకాని ఇవన్నీ ఒకే కుల వృత్తులు.. వీటి డీఎన్ఏ ఒక్కటే. ఒకే రక్తసంబంధం ఒకే కుటుంబమని మనం గుర్తుపెట్టుకోవాలి.
-- శ్రీనివాస్ గౌడ్, మంత్రి
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి అడిగిండు. ఇక్కడికి మా వాళ్లు రావచ్చా అని? ఇక్కడికి ఎవరైనా రావచ్చు. మీవాళ్లు మా వాళ్లు అనే తేడా ఏం ఉండదు. ఇది మనందరిది.
-- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
ఇదీ చదవండి : ముంబయిలో ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ