హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో పాల సేకరణ, కృత్రిమ గర్భధారణ, ఆరోగ్య కార్డులు వంటి అంశాలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు ప్రోత్సహకాలు, ప్రత్యేకంగా లీటరు పాలపై 4 రూపాయల ప్రోత్సాహం, రాయితీ పాడిగేదెల పంపిణీ, కృత్రిమ గర్భధారణ, ఆరోగ్య పరిరక్షణ సేవలు వంటి అంశాలపై చర్చించారు. పాల సేకరణ ఎందుకు పడిపోతుందో అర్థం కావడం లేదని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్ల అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. దీర్ఘకాలికంగా ఒక చోట ఉన్న అధికారులు, సిబ్బందిని పది రోజుల్లోనే బదిలీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 37 లక్షల పశు ఆరోగ్య కార్డులకు ఇప్పటి వరకు 16 లక్షలు ఇచ్చామన్నారు. మిగతావి త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం 22 లక్షల గేదెలకు జియో టాగింగ్ వేసినట్లు ప్రకటించారు. నాణ్యమైన సేవల విషయంలో గోపాలమిత్ర సేవలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ డైయిరీ ఛైర్మన్ లోక భూమారెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీఎస్‌ఎల్‌డీఏ ఛైర్మన్ రాజేశ్వరరావు, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'కేటీఆర్‌పై జీవో ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి'