Nellore floods: ఏపీలోని నెల్లూరు జిల్లాలో వరద ముంపును ఎదుర్కొన్న ప్రతి గ్రామంలోనూ.. బాధితుల (flood victims) కన్నీరు వరద కడుతోంది. ఈ పరిస్థితుల్లో.. ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. పరామర్శకు వెళ్లిన వారిని వరద బాధితులు అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో వరద బాధితులను మంత్రి గౌతమ్‌రెడ్డి పరామర్శించారు. పెన్నా పరివాహక ప్రాంతంలోని అప్పారావుపాలెం గిరిజనులు.. తమను ఆదుకోవాలంటూ మంత్రి కాళ్ల మీద పడ్డారు. వరదల ధాటికి సర్వం కోల్పోయామని కన్నీటిపర్యంతమయ్యారు. వారి కష్టాలు విని చలించిన మంత్రి గౌతంరెడ్డి.. సుమారు కిలోమీటరు దూరం నడిచి వెళ్లి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హమీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు కొత్త కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మొన్న కోవూరులో ఇంఛార్జి మంత్రి బాలినేని, ఎమెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. నిన్న ఆత్మకూరులో మంత్రులు బాలినేని, మేకపాటి గౌతమ్ రెడ్డి.. నేడు ఆత్మకూరులో మహిళలు మంత్రుల కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టారు. సర్వం కోల్పోయామని.. కట్టు బట్టలతో మిగిలామని బోరున విలపించారు. అనంతసాగరం మండలంలోని సోమశిల ప్రాజెక్టు, ప్రాచీన సోమేశ్వర ఆలయం ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. మంత్రులు కనపడగానే తమను ఆదుకోవాలని రేవూరు మహిళలు బోరున విలపించారు. అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు బాధితులకు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: Kadapa Flood Victim: వరద మిగిల్చిన వేదన.. భర్త ఆచూకీ కోసం భార్య తపన