Minister video conference with Collectors in TS : రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతుందని.. గతం కన్నా 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా సేకరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సచివాలయంలో ధాన్యం సేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. తాజా యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, క్షేత్రస్థాయి ఇబ్బందులు, రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఆందోళనలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
MSPతో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం : ప్రతికూల పరిస్థితుల్లో ధాన్యం సేకరణ చేస్తున్న కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. ప్రతి జిల్లా కలెక్టర్‌తోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే పది రోజులు మరింత కీలకం కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ ధాన్యం అన్‌లోడింగ్ సమస్యలు ఉత్పన్నం కావద్దని స్పష్టం చేశారు. రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. నీళ్లు, విద్యుత్‌తో పాటు ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వేగంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. తరుగు సమస్య ఉత్పన్నం కావద్దు.. అందుకు రైతులు కచ్చితంగా ఎఫ్సీఐకు ధాన్యం తెచ్చేలా చూడాలని స్పష్టం చేశారు.
రైతులకు సకాలంలో నగదు చెల్లించాలి : రాజకీయాలు పట్టించుకోకండి, రైతులకు అండంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోదాములు తీసుకొని.. రైస్ మిల్లర్లతో సంబంధం లేకుండా.. అన్‌లోడింగ్ చేసి రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గతంలో రూ.3,150 కోట్లు చెల్లించారని.. ప్రస్తుతం 3,160 కోట్లు ఇచ్చారని చెప్పారు. ట్రాన్స్‌పోర్ట్స్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని సూచించారు.
రాబోయే పది రోజులు కీలకం : పక్క రాష్ట్రాల్లో కొనుగోళ్లు లేనందున ఆ ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే పది రోజులు అత్యంత కీలకం.. యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ రవీందర్‌సింగ్, కమిషనర్ అనిల్‌కుమార్, జనరల్ మేనేజర్లు రాజారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: