రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ప్రభుత్వానికి ఓ పాఠంలా మారాయని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ మారుతి నగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. ప్రధానంగా నాలా ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా భారీ జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో ఏర్పడిన వరద నీటి సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజల వద్దకు వచ్చి చేస్తున్న హంగామా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా.. త్వరలోనే పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వివరించారు.