Minister Thalasani Press Meet : భారత్ రాష్ట్ర సమితి అనేది ఒక బలమైన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో ఎవరితోని పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. " భారత్ రాష్ట్ర సమితి అనేది ఒక బలమైన పార్టీ అని... వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. అయితే వామపక్షాలతో పొత్తు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇస్తారని తెలిపారు.
రాష్ట్రంలో హంగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పడదని తలసాని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల దయ వల్ల మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని.. వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల్లో ఎంత ప్రచారం చేసినా.. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని స్పష్టం చేశారు.
అది కాంగ్రెస్ వ్యవహారం: కోమటి రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు తలసాని నిరాకరించారు. అది కాంగ్రెస్ పార్టీ వ్యవహరమన్నారు. కొంత మంది నూతన సెక్రటేరియట్‌ను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దానిని నిర్మించినట్లు తెలిపారు. నిర్మించే వాళ్లకే ఆ కష్టం తెలుస్తుందని... విపక్షాలకు మాటలు మాట్లాడటం సులభమే కానీ చేతల్లో చూపించే సత్తా వారికి లేదన్నారు.
కిషన్ రెడ్డికి సవాల్: కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన సొంత నియోజక వర్గానికి ఏం చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఆయన గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన అంబర్ పేట్ నియోజక వర్గంలోనూ ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అంబర్ పేట్ అమ్మవారి దేవాలయం వద్దకు కిషన్ రెడ్డి వస్తే.. తమ పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్ చర్చకు సిద్ధమని తలసాని సవాల్ విసిరారు.
థ్రిల్ సిటీలో కేసీఆర్ జన్మదిన వేడుకలు: ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తలసాని తెలిపారు. ఇందుకోసం నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు పక్కనున్న థ్రిల్ సిటీలో వేడుకలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ కేక్ కట్ చేయనున్నారు.
ఈ వేడుకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జబర్దస్త్ ఆర్టిస్టులతో స్కిట్లు ప్రదర్శిస్తామని వెల్లడించారు.
ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు: జంటనగరాల్లోని ప్రముఖ ప్రార్థన మందిరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయని తలసాని తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో మేయర్, సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో డిప్యూటీ మేయర్ ప్రత్యేక పూజలు చేస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆయుష్షు హోమం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో రాజ శ్యామల యాగం, చార్మినార్ భాగ్యలక్ష్మి గుడిలో గోత్రనామాల అర్చన, లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో లక్ష పుష్పార్చన జరుగుతుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ సీఎస్ఐ చర్చి, అబిడ్స్ వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గురుద్వారా, మసీదుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తలసాని ప్రకటించారు.
ఇవీ చదవండి: