గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ కార్పొరేటర్లు మనోధైర్యం కోల్పోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో పలుమార్లు కార్పొరేటర్ అభ్యర్థులను తట్టిలేపాల్సిన పరిస్థితి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద మంత్రి తలసాని.. సనత్ నగర్ నియోజకవర్గ తెరాస పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
కార్యకర్తలు సహకరించాలి
రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 8న నిర్వహించే భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్యకర్తలను మంత్రి కోరారు. బంద్‌కు అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 2 వేల వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్‌ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, కురుమ హేమలత, మహేశ్వరి, నామన శేషుకుమారి, తదితరులు పాల్గొన్నారు..
ఇదీ చదవండి: వైరస్‌లను పసిగట్టేలా... వ్యాధుల పనిపట్టేలా!