రాష్ట్రంలో మూగజీవాల కోసం పశుగ్రాసం పెంపకం.. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్ల పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్ నుంచి అన్ని జిల్లాల పశు, వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గడ్డి విత్తనాలపై నివేదిక..
పశుసంవర్థక శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం పెంపకం చేపట్టేందుకు రైతులకు రాయితీపై గడ్డి విత్తనాలు సరఫరా చేసిన దృష్ట్యా పురోగతిపై మంత్రి విస్తృతంగా చర్చించారు. తాము తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల వల్లే పశుగ్రాసం కొరత లేకుండా నివారించగలిగామని మంత్రి పేర్కొన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో గడ్డి పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ఇప్పట్నుంచే గడ్డి పెంపకం చేపట్టాలని, గడ్డి విత్తనాలపై నివేదిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఈ ఏడాది 90 కోట్లు..
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది కూడా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గతేడాది 18,335 చెరువుల్లో 68.52 కోట్ల చేప పిల్లలు, 93 చెరువుల్లో 4 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది వివిధ చెరువుల్లో 90 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు 6 కోట్ల రొయ్య పిల్లలు విడుదల చేసేందుకు అనువుగా ఉండే చెరువులు గుర్తించాలని సూచించారు. చెరువులకు జియో ట్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. టోకు చేపల మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వెల్లడించారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..
కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని చెప్పారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంటూ, ఆస్పత్రుల పనితీరును సమీక్షించాలని చెప్పారు. క్షేత్రస్థాయి తనిఖీలతో సమస్యలపై కచ్చితమైన అవగాహన కలుగుతుందని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'కరోనా నియంత్రణ కంటే ఎన్నికలే ముఖ్యమా..?'