హైదరాబాద్ జిల్లాలో 168 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 95 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని.. 2 రోజుల్లో మరో 10 ప్రారంభించనున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు.
సౌకర్యాలు కల్పించండి
గ్రేటర్ పరిధిలో సుమారు 2,200 కమిటీ హాల్స్ ఉన్నాయని, అందులో కొన్ని ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్నాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకొనెలా జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఆ కమిటీ హాల్ల లోనే బస్తీ దవాఖానాలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైన చోట్ల బస్తీ దవాఖానాల కోసం మొదటి అంతస్తు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బస్తీ దవాఖానా సిబ్బందికి టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని సూచించారు.
స్థలాలు గుర్తించండి
బస్తీ దవాఖానాలకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, ఆశించిన సత్ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో మౌలిక వసతులు, పర్నిచర్ కోసం లక్షా 30 వేల రూపాయలు ఇస్త్తున్నారని, అవి సరిపోనందున 2 లక్షలకు పెంచేలా చూడాలని మంత్రిని కలెక్టర్ కోరారు. ప్రస్తుతం 85 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయని, వీటిలో కొన్ని అద్దె భవనాలలో, మరి కొన్ని ఒకే చోట ఒకే భవనంలో 2 నుంచి 3 సెంటర్లు నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి.. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అంబులెన్స్‌లు అవసాన దశలో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించగా.. వాటి స్థానంలో నూతన అంబులెన్స్ లను ప్రభుత్వం నుంచి కాని, దాతల సహకారంతో కాని ఏర్పాటు చేసేలా చూస్తానని మంత్రి తలసాని పేర్కొన్నారు.
వాటిపై చర్యలు తీసుకోండి
బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న సమస్యలపై ఒక సమగ్ర నివేదిక రూపొందించి అందజేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల నిర్వహణకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహకులు కరోనా చికిత్స కోసం అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న తరుణంలో అలాంటి ఆసుపత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కరోనా టెస్ట్‌లు, చికిత్స విషయాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఇదీ చదవండి: చిచ్చర పిడుగులకు అడుగులు నేర్పుదామా?