Talasani On BJP Leaders: రాష్ట్రానికి భాజపా ఏం చేసిందని నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. నలుగురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ఉండి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని భాజపా నాయకులను నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన కారు, బైక్ హామీలు ఏమయ్యాయని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
talasani on bjp and congress: భాజపా రాష్ట్ర నాయకులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతూ డ్రామాలాడుతున్నారని మంత్రి తలసాని విమర్శించారు. కేటీఆర్ కుమారుడిని కూడా విమర్శించే నీచమైనస్థాయికి భాజపా నాయకులు చేరారని మండిపడ్డారు. నోరూంది కదా అని మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భాజపాలు డ్రామా కంపెనీలుగా మారిపోయాయని మంత్రి తలసాని దుయ్యబట్టారు.
'భాజపా నాయకులు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు. మీరు ఏం చేశారు. నలుగురు ఎంపీలు, ఒక మంత్రి ఉన్నారు. తెలంగాణకు ఏం తీసుకొచ్చారు. మీరు మంచి చేస్తే మేము కూడా ఆహ్వానిస్తాం. మీకు సన్మానం కూడా చేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనేమో స్కూటరు పోతే ఇస్తా, కారు పోతే ఇస్తామని చెప్పిర్రు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్, ఏజెన్సీలు మాత్రం ర్యాంకులు, సర్టిఫికేట్లు ఇస్తారు. తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని ప్రకటిస్తారు. మరి వాళ్లకు కనిపిస్తలేవా.. మీకు కనిపిస్తాలేవా?. ఇక్కడ ఏదో డ్రామా కంపెనీ పెట్టి.. పంజాబ్‌లో దేనికి పనికి రాని వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ దుకాణం పెట్టిర్రు.' - తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి