స్విగ్గి, బిగ్ బాస్కెట్ తదితర డోర్ డెలివరీ సంస్థల ద్వారా పాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో శనివారం వివిధ డెయిరీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. హెచ్‌ఎండీఏ పరిధిలో లాక్‌డౌన్‌కు ముందు రోజూ 30 లక్షల లీటర్ల పాలు సరఫరా కాగా, ఇప్పుడు 27 లక్షలకు తగ్గిందని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తెలిపారు. పాల సరఫరాకు సిబ్బంది ముందుకు రాకపోవడమే కారణమని ఆయన అభిప్రాయ పడ్డారు.
రేటు పెంచి అమ్మితే పీడీ చట్టం కింద చర్యలు
రిటైల్ వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు పాలు విక్రయిస్తే పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. పాల సరఫరా, పంపిణీలో సమస్యలుంటే కంట్రోల్ రూం నెంబరు 040-23450624కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్, అదనపు సంచాలకుడు రాంచందర్, వివిధ డెయిరీల ప్రతినిధులు పాల్గొన్నారు. పశుగ్రాసం, దాణా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దాణా కిలో రూ.22-25, పచ్చిగడ్డి రూ.2- 2.50, వరిగడ్డి రూ.5- 6.50, కుట్టి రూ.7 - 7.50. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే 91212 13220 ఫోన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు.
ఇదీ చూడండి: కరోనా లక్షణాలతో రాష్ట్రంలో తొలి మరణం