తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ, పశుసంవర్ధక శాఖ కార్యకలాపాలపై అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులో మంత్రి వీడిమో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీపై తలసాని సమీక్షించారు. 32 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో చేప పిల్లల నాణ్యత, పరిమాణం విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాజన్న సిరిసిల్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చేప పిల్లలు తిరస్కరించామని చెప్పారు.
తప్పనిసరిగా ఆహ్వానించాలి
ఉచిత చేప పిల్లల విడుదల, లెక్కింపు పూర్తయ్యే వరకు మత్స్య శాఖ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులను తప్పనిసరిగా ఆహ్వానించాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఈ ఏడాది వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తలసాని ఆదేశించారు.
ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం
వేసవి కాలంలో పశుగ్రాసం కొరత రాకుండా టీఎస్, పాడి పరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్యకు చెందిన ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం పెంపకం చేపట్టాలని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు సంచాలకులు రాంచందర్, విజయా డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావు, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శంకర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : అధైర్య పడకండి... ప్రభుత్వం అండగా ఉంటుంది : ఈటల