దూల్‌పేటలో గుడుంబా బాధితులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్దం చేయాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. గోషామహల్ నియోజకవర్గం దూల్‌పేట గుడుంబా బాధితులకు పునరావాస కల్పనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్రంలో గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. గుడుంబా బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చగలిగినట్లు వివరించారు.
గతంలో దూల్‌పేట అంతా చెత్త, చెదారంతో నిండిపోయి వ్యాధులు సంక్రమించి చనిపోయే పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు పూర్తిగా అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. అదే విధంగా దూల్‌పేటలో గుడుంబా పూర్తిగా నిర్మూలన కావడం వల్ల బాధితులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను ఎంచుకున్నారన్నారు. గుడుంబా నిర్మూలనలో భాగంగా దూల్‌పేటలో 505 మందికి, హైదరాబాద్ జిల్లా మొత్తం మీద 795 మంది బాధితులకు రెండేసి లక్షల రూపాయలు చొప్పున దాదాపు రూ.16 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు.
స్థానిక శాసన సభ్యులు రాజాసింగ్ చేసిన పలు సూచనలకు, సలహాలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. పునరావాస పథకంలో భాగంగా బాధితులకు ప్రభుత్వం స్వయం, ఉపాధి కల్పన పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ అందివ్వడం ద్వారా వెలుగులు నింపాలని అబ్కారీ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. దూల్‌పేటలో ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ స్కిల్ డెవలప్ సెంటర్‌కు, స్వయం ఉపాధి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో సమావేశం కావాలని అధికారులను ఆదేశించారు. గంజాయి విక్రయించేవారిని అంతే కఠినంగా శిక్షించాలని, అవసరమైతే పీడీ చట్టాన్ని ప్రయోగించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: వైద్యుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు: ఈటల