కరోనా నేపథ్యంలో నీరా అమ్మకాలను ప్లాస్టిక్ సీసాలలో కాకుండా టెట్రా ప్యాక్‌లలో మాత్రమే జరపాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న నీరా కేంద్రం పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల లీజు కాలపరిమితిని పది సంవత్సరాలకు పెంచుతూ... ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు.
అర్హత కలిగిన గీత వృత్తిదారులకు శాఖాపరమైన సభ్యత్వ కార్డులను ఇవ్వాలని అధికారులకు సూచించారు. నీరా సరఫరాదారులతో టెక్నాలజీ ప్రాసెసింగ్‌పై ఎమ్ఓయూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. 250మిల్లీలీటర్లు, ఒక లీటర్ టెట్రాప్యాక్‌లను బాటిల్‌ను పోలి ఉండేట్లు డిజైన్ చేయాలన్నారు. కల్లు సొసైటీల ద్వారా తాటి, ఈత చెట్లకు నెంబర్లును వేసి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ను మరింత పటిష్ఠపరిచేందుకు ప్రత్యేకంగా సమర్ధవంతమైన అధికారిని నియమించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు