రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వృద్ధ కళాకారులకు రూ.1500 పింఛన్ ఇచ్చేవారమని... ఇప్పుడు రూ.3,016కు పెంచినట్లు ఆయన చెప్పారు. దీనివల్ల 2,661 మంది వృద్ధ కళాకారులకు ప్రయోజనం చేకురుతుందన్నారు. ప్రభుత్వం వీరి కోసం నెలకు రూ.80 లక్షల చొప్పున ఏడాదికి 9 కోట్ల 62 లక్షల 71 వేలు ఖర్చు చేస్తుందన్నారు.
పెంచిన పింఛను మొత్తం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అమలు చేస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చామని... కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ కళలకు కాణాచి... సకల కళల ఖజానా అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ, బోనాలు పండుగలను, సమ్మక్కసారక్క, ఏడుపాయల, నాగోబా, కురుమూర్తి వంటి జాతరలను ఘనంగా నిర్వహించుకుంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెబుతున్నామన్నారు. సమావేశంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?