పీఆర్సీ నివేదిక ప్రకారం 7.5శాతమే వేతనాలు పెంచాలని ఉన్నప్పటికీ.. 30శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల పట్ల తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్ చాటుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దేశంలోనే అధికంగా వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నూతనంగా నియామకమైన 60మందికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. ఇప్పుడున్న 63మంది సిబ్బందికి మరో 60 మంది చేరడం వల్ల బెవరేజెస్ కార్పొరేషన్‌కు ఎంతో లబ్ధి చేకూరుతుందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక లోటు ఉన్నా..
ఆరున్నరేళ్ల వ్యవధిలోనే 73 శాతం వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యోగులకు జీతాలు పెంచిందని అన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్ సెంటర్లు: మంత్రి ఈటల