దేశంలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయం నుంచి వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, పౌరసరఫరాలు శాఖ డీఓఏ, డీసీఓ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ అధ్యక్షులు, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు, మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమ ప్రభుత్వం
కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మేలు చేయాలని తీసుకున్న నిర్ణయమిది అని చెప్పారు. దేశవ్యాప్తంగా వస్తున్న దిగుబడిలో సగానికి పైగా ధాన్యం తెలంగాణ నుంచి వస్తున్న దృష్ట్యా మిల్లర్లు అధికారులు చెప్పింది వినాలి తప్ప... మిల్లర్లు చెప్పింది అధికారులు వినొద్దని స్పష్టం చేశారు. రైతు కల్లంకాడికి వస్తే ఇంత ధాన్యం ప్రేమతో పెడతాడు... కానీ, తూకం వేసిన తర్వాత అన్యాయంగా కట్ చేస్తే ఏ మాత్రం ఒప్పుకోడని గుర్తు చేశారు. తూకం వేసిన తర్వాత మళ్లీ తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవడమే కాకుండా ఎవరైనా మిల్లర్లు తరుగు తీస్తే మిల్లుల లైసెన్సులు నిర్మొహమాటంగా రద్దు చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న రైతువేదికలు, ఇతర గోదాములు అన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వానికి సహకరించండి
ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం జరగకుండా చూడాలని చెప్పారు. ధాన్యం దిగుబడి ఎక్కువచ్చినప్పుడు దానికి తగినట్లుగా సహకరించాలని, రవాణా సరఫరా కోసం కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు దానికి తగినట్లు వాహనాలు ఏర్పాటు చేయాలి... లేకుంటే వారి వైఫల్యమేనని అన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంట అమ్ముకునే విషయంలో ఇబ్బందిపెట్టటం మంచి పద్ధతి కాదని... రైతులు కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మిల్లర్ల విషయంలో ఎట్టి పరిస్థితులలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం