గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి గిరిజన సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయాల, ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.
పరీక్షల నేపథ్యంలో..
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో... విద్యార్థుల భద్రత, విద్యాలయాల్లో కరోనా వైరస్ పట్ల అప్రమత్తతపై దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో సమీక్ష నిర్వహించారు. గిరిజన విద్యా సంస్థల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చే సూచనలు, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల కోసం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యా సంస్థల్లో కచ్చితంగా అందుబాటులో ఉండాలన్నారు.
అంకిత భావంతో పనిచేయండి..
ఐటీడీఏల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తుల ద్వారా గానీ, ఇతర మార్గాల ద్వారాగాని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కొత్తగా వచ్చిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు అంకిత భావంతో, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలన్నారు.
ఇది చూడండి: కరోనా: మాస్క్ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?