Sabitha Indra Reddy on Mid Day Meal Scheme : పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించేలాా పర్యవేక్షణ పెంచాలని ఆమె సూచించారు. ప్రాథమిక విద్యలో అభ్యసన సంక్షోభాన్ని నివారించి.. భాష, గణిత సామర్థ్యాలను పెంచేందుకు అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమానికి ప్రత్యేక వార్షిక ప్రణాళిక ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆమె.. పాఠశాల విద్యార్థుల్లో సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా రాష్ట్రస్థాయి సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో చర్యలు చేపడతామన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు సమీపించిన తరువాత తొందరపడకుండా.. ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు.
Sabita Indra Reddy review of Mana Uru Mana Badi works : మన ఊరు- మన బడి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీల ద్వారా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు యూనిఫాంలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని.. డీఈవోలకు మంత్రి తెలిపారు. వారం రోజుల్లోగా విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు అందకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
పెంచిన జీతాలు ఈ నెల నుంచి అమలు: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు వెల్లడించారు. వేతనాలను పెంచడం వలన రాష్ట్రంలోని 54 వేల 201 మంది కుక్ కమ్ హెల్పర్లకు లబ్ది చేకూరుతుందని మంత్రి వివరించారు. దీని వలన ప్రభుత్వానికి ఏటా రూ.108 కోట్ల 40 లక్షల అదనపు భారం పడుతుందని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
వంట ఏజెన్సీలు ఆందోళనలు: మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాల పిల్లలకు వంట చేస్తున్న ఏజెన్సీలకు బకాయి పడిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎక్కడిక్కడ ఆందోళనలు చేస్తున్నారు. గత జనవరి నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వంట ఏజెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తమను వర్కర్లుగా గుర్తించాలని.. ప్రమాద బీమాను వర్తింప జేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: