ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే దిశలో భాగంగా ప్రథమంగా గురువారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో అవుట్లెట్ (పెట్రోల్ బంకు)ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. సంస్థ ఆర్థిక పరిపుష్ఠికై రిటైల్ ఇంధన వ్యాపారాన్ని ఆర్టీసీ చేపట్టిందని ఆయన తెలిపారు.
ఆగష్టు నాటికి పూర్తి స్థాయిలో
హన్మకొండ, మహబూబాబాద్, బిచ్కుంద, బీర్కూర్, ఆసిఫాబాద్‌లలో మొత్తం 5 అవుట్లెట్లను ఆగష్టు నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొస్తామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ భాగస్వామ్యంతో ఇంధనం అమ్మకాల వ్యాపారాన్ని ప్రత్యక్షంగా నిర్వహించడానికి ఎంఓయూ ఒప్పందం చేసుకుందని వివరించారు.
రిటైల్ ఇంధన కార్యకలాపాలను టీఎస్ఆర్టీసీ స్వయంగా నిర్వహించడం వల్ల రిటైల్ ఇంధన కార్యకలాపాల నిర్వహణతో ఆర్టీసీకి సుమారు నెలకు రూ.20.65 లక్షల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
వివరాలిలా...
హెచ్‌పీసీయల్, ఐఓసీయల్ ద్వారా స్థాపించబడనున్న 92 పెట్రోల్ బంకుల నిర్వహణ కోసం... గ్రేటర్ హైదరాబాద్ జోన్, హైదరాబాద్ జోన్, కరీంనగర్ జోన్లకు ఓపెన్ టెండర్ల ద్వారా సర్వీసు ప్రొవైడర్లను కార్పొరేషన్ నియమించిందన్నారు. చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 2.83పైసలు, హెచ్ఎస్డీ ఆయిల్‌పై లీటర్‌కు రూ.1.89పైసలు డీలర్‌కు కమీషన్‌గా చెల్లిస్తారు.
ఆర్టీసి పెట్రోల్ బంకులు నిర్వహించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన చమురు లభిస్తుందని అధికారులు హామీనిస్తున్నారు. దాని వల్ల ఇంజిన్ జీవితకాలం పెరగడంతో పాటు ఎక్కువ మైలేజ్ పొందడం వంటి ప్రయోజనాలు సమకూరుతాయని రవాణా శాఖ మంత్రి తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం