ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఇంజినీర్లను రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఈఎన్సీలు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల ఎస్ఈలు, ఇతర అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదార్ల మరమ్మతుల కోసం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో 571 కోట్ల రూపాయలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే కొనసాగుతున్న పనులకు రుణం మంజూరు అయ్యిందని... పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలని మంత్రి అధికారులకు సూచించారు. త్వరలోనే తాను జిల్లాల్లో పర్యటించి స్థానిక మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలిసి పనులు పరిశీలిస్తానని చెప్పారు. ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో మేడారం రహదారులపై కూడా ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై నాలుగు బైపాస్‌లను డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: 'అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు'