అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు చాలా అర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ఏరోజు అజెండా ఆరోజే పూర్తయిందన్నారు. ఏడు రోజుల పాటు రోజుకు ఐదు గంటల పైచిలుకు సభ సమావేశమైందన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఆరు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని వివరించారు.
వాకౌట్లు, సస్పెన్షన్లు లేకుండా ఏడు రోజుల సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. అధికారపక్షం కంటే ప్రతిపక్షాలకే అధిక సమయం ఇచ్చినట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సమయం ఇవ్వలేదన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపణలు తోసిపుచ్చారు. మరికొన్నాళ్ల పాటు సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావించారు.. కానీ పండగలు ఉన్నాయని సభ్యులు కోరారని తెలిపారు. సమావేశాలు ముగించే విషయమై గురువారమే.. సభాపతి అన్ని పక్షాల నేతలతో చర్చించినట్లు చెప్పారు. శీతాకాల సమావేశాల్లో మిగిలిన అన్ని అంశాలపైనా చర్చిస్తామన్న మంత్రి... తదుపరి సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు పూర్తి స్థాయిలో సన్నద్ధమై రావాలని సూచించారు.
'రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు సుధీర్ఘంగా చర్చకువచ్చాయి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సమావేశాల ముందే తమకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. అధికారపార్టీ సభ్యుల కంటే ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చాం. శీతాకాల సమావేశాల్లో మిగిలిన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చిస్తాం. కాంగ్రెస్ సభ్యులు పూర్తిగా సన్నద్ధమై రావాలి.'
- వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి.
ఇదీచూడండి: TELANGANA ASSEMBLY SESSION: రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిపై చులకనగా మాట్లాడొద్దు: సీఎం కేసీఆర్