Minister Ponnam Prabhakar Meet With Auto Drivers : ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆటో యూనియన్ జేఏసీ ప్రతినిధులతో రవాణాశాఖ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో గురువారం రోజున కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ద ప్రకాష్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో యూనియన్ ప్రతినిధులకు తెలియజేశారు. తద్వారా ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఆ వియషంలో ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రయాణికుల వద్దకు బస్సులు వెళ్ళవని వాటి వద్దకే ప్రయాణికులు వస్తారని, అదేవిధంగా ఆటోల్లోనూ ప్రజలు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ ట్రాక్‌లో పడవద్దని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆటో డ్రైవర్లకు రవాణా శాఖ అధికారుల నుంచి ఏమైనా సమస్య ఉన్నాయా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది 22 వేల ప్రమాదాలు జరిగాయని 3 వేల మంది ప్రమాదంలో చనిపోయారని రోడ్డు భధ్రత విషయంలో ఆటో డ్రైవర్లు అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 80శాతం రాయితి ఇచ్చిందని గుర్తు చేశారు.
ఆటో కార్మికులకు తగిన న్యాయం : మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Meet With Auto Head Unions : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఈఎస్ఐతో కూడిన ఆటో మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు.
మహిళలకు ఉచిత పథకం ఎఫెక్ట్ మాములుగా లేదుగా- 11 రోజుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణాలు
ఆటో మీటర్ చార్జీలను పెంచాలని, ఆటోలకు ఇన్సూరెన్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాలు నిండిన గీతా నేత కార్మికుల మాదిరిగా ఆటో డ్రైవర్లకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. అక్రమంగా నడుస్తున్న ఓలా, ఉబర్లను, ద్విచక్ర వాహనాలను నిషేధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆటో యూనియన్ నేతలు విన్నవించారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్న మాదిరిగా ఆటో సంక్షేమ సోసైటీ ఎలా ఉండాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు.
ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం పడకూడదు - ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి : భట్టి విక్రమార్క
ఆటో చార్జీలు పెంచె ప్రసక్తే లేదు : ఆటో చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆటో యూనియన్ ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేయగా, తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. కర్ణాటక, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఆటో పర్మిట్లు, ఇన్సూరెన్స్‌లు, వెల్ఫేర్ సోసైటీకి సంబంధించిన లిఖిత పూర్వక సూచనలు ఇవ్వాలని సంఘాల నేతలకు సూచించారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ - గిరాకీ లేక వెలవెలబోతున్న ఆటోలు - లబోదిబోమంటున్న డ్రైవర్లు